Logo

యెహెజ్కేలు అధ్యాయము 18

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు?

03 నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

04 మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును.

05 ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి

06 పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,

07 ఎవనినైనను భాదపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

08 వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి

09 యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల ననుసరించుచుండిన యెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

10 అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి

11 చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు,

12 దీనులను దరిద్రులను భాదపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,

13 అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాదియగును.

14 అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రిచేసిన పాపములన్నిటిని చూచి, ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండినయెడల, అనగా

15 పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు,

16 ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

17 బీదవాని మీద అన్యాయముగా చెయ్యివేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండినయెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.

18 అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగనిక్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణమునొందును.

19 అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోషశిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతిన్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రదుకును.

20 పాపము చేయువాడే మరణమునొందును; తండ్రియొక్క దోషశిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.

21 అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణమునొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.

22 అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.

23 దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

24 అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణమునొందును.

25 అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమేగదా అన్యాయమైనది?

26 నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణమునొందును; తాను పాపము చేయుటనుబట్టియేగదా అతడు మరణమునొందును?

27 మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించినయెడల తన ప్రాణము రక్షించుకొనును.

28 అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.

29 అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు.

30 కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.

31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

32 మరణమునొందువాడు మరణమునొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.