Logo

యెహెజ్కేలు అధ్యాయము 39

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు నరపుత్రుడా, గోగునుగూర్చి ప్రవచనమెత్తి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినైయున్నాను.

02 నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, ఉత్తరదిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి

03 నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను,

04 నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతములమీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను.

05 నీవు పొలముమీద కూలుదువు, నేనే మాట యిచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

06 నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించువారి మీదికిని అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

07 నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను.

08 ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

09 ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును.

10 వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయునుండి, ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు, తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్లపెట్టినవారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

11 ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.

12 దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు.

13 నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతిపెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.

14 దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియమించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు.

15 దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్యశల్య మొకటియైనను కనబడినయెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టువరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టుదురు.

16 మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు.

17 నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సకలజాతుల పక్షులకును భూమృగములకన్నిటికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు;

18 బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు.

19 నేను మీ కొరకు బలి వధింపబోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు.

20 నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

21 నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరు చూచెదరు.

22 ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై యున్నానని ఇశ్రాయేలీయులు తెలిసికొందురు.

23 మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమునుబట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాస ఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గముచేత కూలునట్లుగా వారిని బాధించువారికి అప్పగించితిననియు అన్యజనులు తెలిసికొందురు.

24 వారి యపవిత్రతనుబట్టియు అతిక్రమ క్రియలనుబట్టియు నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతికారము చేసితిని.

25 కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ద నామమునుబట్టి రోషము కలిగినవాడనై యాకోబు సంతతివారిని చెరలోనుండి రప్పించెదను, ఇశ్రాయేలీయులందరియెడల జాలిపడెదను.

26 వారు నాయెడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలోనుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములోనుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించునప్పుడు

27 వారియందు అన్యజనులనేకముల యెదుట నన్ను పరిశుద్ధ పరచుకొందును.

28 అన్యజనులలోనికి వారిని చెరగా పంపి, వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనియ్యక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతినిబట్టి నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

29 అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.