Logo

యెహెజ్కేలు అధ్యాయము 46

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పుతట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతిదినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.

02 అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధపరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికిపోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.

03 మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను.

04 విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱ పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.

05 పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.

06 అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱ పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.

07 నైవేద్యమును సిద్ధపరచవలెను, ఎద్దుతోను పొట్టేలుతోను తూమెడు పిండిని గొఱ్ఱపిల్లలతో శక్తికొలది పిండిని అర్పింపవలెను, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె నైవేద్యము చేయవలెను.

08 అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.

09 అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే యెవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికిపోవలెను.

10 అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలువెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.

11 పండుగదినములలోను నియామక కాలములలోను ఎద్దుతోగాని పొట్టేలుతోగాని తూమెడు పిండియు, గొఱ్ఱపిల్లలతో శక్తికొలది పిండియు, తూము ఒకటింటికి మూడుపళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను.

12 యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతిదినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను.

13 మరియు ప్రతి దినము నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను దహనబలిగా అర్పింపవలెను; అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను.

14 అది ఎట్లనగా తూమెడు గోధుమపిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను; ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు.

15 గొఱ్ఱపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్యదహనబలిగా అర్పింపవలెను.

16 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము.

17 అయితే అతడు తన పనివారిలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల విడుదల సంవత్సరమువరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలవచ్చును; అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు.

18 జనులు తమ స్వాస్థ్యము ననుభవింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.

19 పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడమార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కున స్థలమొకటి కనబడెను.

20 ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చియాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియేయని నాతోచెప్పి

21 అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనివచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణముయొక్క మూలమూలను మరియొక ఆవరణమున్నట్టు కనబడెను.

22 ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి నలువది మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును గలిగి నాలుగును ఏకపరిమాణముగా ఉండెను.

23 మరియు ఆ నాలుగింటిలోను చుట్టు పంక్తిగానున్న అటకలుండెను, చుట్టునున్న అటకలక్రింద పొయిలుండెను.

24 ఇది వంటచేయువారి స్థలము, ఇక్కడ మందిరపరిచారకులు జనులు తెచ్చు బలిపశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను.