Logo

యెహెజ్కేలు అధ్యాయము 33

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

02 నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకానొక దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినయెడల

03 అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున

04 ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గమువచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది

05 బాకానాదము వినియును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడినయెడల తన ప్రాణమును రక్షించుకొనును.

06 అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందుచేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించినయెడల వాడు తన దోషమునుబట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణ చేయుదును.

07 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.

08 దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయనియెడల ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణ చేయుదును.

09 అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.

10 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము మా పాపదోషములు మామీద పడియున్నవి, వాటివలన మేము క్షీణించుచున్నాము, మనమెట్లు బ్రదకుదుమని మీరు చెప్పుకొనుమాట నిజమే.

11 కాగా వారితో ఇట్లనుము నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

12 మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడుతనమునుబట్టి వాడు పడిపోడు, ఆలాగుననే నీతిమంతుడు పాపముచేసిన దినమున తన నీతినిబట్టి అతడు బ్రదుకజాలడు.

13 నీతిమంతుడు నిజముగా బ్రదుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారముచేసికొని పాపము చేసినయెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమునుబట్టి యతడు మరణము నొందును.

14 మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుసరించుచు

15 కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.

16 అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతిన్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.

17 అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని యనుకొందురు; అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది?

18 నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసినయెడల ఆ పాపమునుబట్టి అతడు మరణమునొందును.

19 మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిన్యాయములను అనుసరించినయెడల వాటినిబట్టి అతడు బ్రదుకును.

20 యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే; ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధించెదను.

21 మనము చెరలోనికి వచ్చిన పండ్రెండవ సంవత్సరము పదియవ నెల అయిదవ దినమున ఒకడు యెరూషలేములోనుండి తప్పించుకొని నాయొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడెనని తెలియజేసెను.

22 తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నామీదికి వచ్చెను; ఉదయమున అతడు నాయొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను, అప్పటినుండి నేను మౌనిని కాకయుంటిని.

23 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

24 నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆ యా చోట్లను కాపురమున్నవారు అబ్రాహాము ఒంటరియై యీ దేశమును స్వాస్థ్యముగా పొందెను గదా; అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు.

25 కాబట్టి వారికీమాట ప్రకటన చేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహములవైపు దృష్టియుంచు మీరు, నరహత్యచేయు మీరు, ఈ దేశమును స్వతంత్రించుకొందురా?

26 మీరు ఖడ్గము నాధారము చేసికొనువారు, హేయక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు; మీవంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవీలాగున వారికి చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదెమనగా

27 నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గముచేత కూలుదురు, బయట పొలములో ఉండువారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను, కోటలలోనివారును గుహలలోనివారును తెగులుచేత చచ్చెదరు.

28 ఆ దేశమును నిర్జనముగాను పాడుగానుచేసి దాని బలాతిశయమును మాన్పించెదను, ఎవరును వాటిలో సంచరింపకుండ ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును.

29 వారు చేసిన హేయక్రియలన్నిటినిబట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

30 మరియు నరపుత్రుడా; నీ జనుల గోడదగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్నుగూర్చి మాటలాడుదురు, ఒకరినొకరు చూచిపోదము రండి, యెహోవా యొద్దనుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు.

31 నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది.

32 నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి నడుచుకొనరు.

33 అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొకడు తమ మధ్యనుండెనని వారు తెలిసికొందురు.