Logo

యెహెజ్కేలు అధ్యాయము 38

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైనవాని తట్టు అభిముఖుడవై అతనిగూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము

03 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినైయున్నాను.

04 నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలుదేరదీసెదను.

05 నీతో కూడిన పారసీకదేశపువారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిరస్త్రాణములను ధరించువారినందరిని నేను బయలుదేరదీసెదను.

06 గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కులలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతోకూడ వచ్చును.

07 నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండవలెను.

08 చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించుకొని, ఆ యా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివసించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.

09 గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశముమీదికి వచ్చెదవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు.

10 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును,

11 నీవు దురాలోచనచేసి ఇట్లనుకొందువు నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని దేశముమీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారిమీదికి పోయెదను.

12 వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగిపోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనులమీదికి తిరిగిపోయెదను.

13 సెబావారును దదానువారును తర్షీషు వర్తకులును కొదమసింహముల వంటివారైన దానివారందరును నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని, వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొని పోవుటకు చాల దోపుడు దోచుకొనుటకు వచ్చితివా? అని నిన్నడుగుదురు.

14 కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలిసికొందువుగదా?

15 ఉత్తరదిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనములనేకములును గుఱ్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి

16 మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్యదినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసికొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశముమీదికి నిన్ను రప్పించెదను.

17 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేట ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చినదే గదా?

18 ఆ దినమున, గోగు ఇశ్రాయేలీయుల దేశముమీదికి రాబోవు ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

19 కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగినవాడనై యీలాగు ప్రమాణము చేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును.

20 సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకు పురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును

21 నా పర్వతములన్నిటిలో అతనిమీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

22 తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారిమీదను అతనితో కూడిన జనములనేకములమీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.

23 నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారియెదుట నన్ను తెలియపరచుకొందును.