Logo

యెహెజ్కేలు అధ్యాయము 35

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 నరపుత్రుడా, శేయీరు పర్వతమువైపు నీ ముఖము త్రిప్పుకొని

03 దానికి మాటయెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీమీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను.

04 నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు.

05 ఇశ్రాయేలీయులయెడల ఎడతెగని పగకలిగి, వారి దోషసమాప్తికాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక

06 నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసెదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

07 వచ్చువారును పోవువారును లేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును.

08 అతని పర్వతములను హతమైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు.

09 నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.

10 యెహోవా అక్కడనుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశములును మనవే; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే;

11 నా జీవముతోడు నీవు వారియెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధముచొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.

12 అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములనుగురించి పలికిన దూషణమాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు.

13 పెద్దనోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను.

14 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను.

15 ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.