Logo

యెహెజ్కేలు అధ్యాయము 43

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 తరువాత అతడు తూర్పుతట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొనిరాగా

02 ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టినధ్వని విస్తారజలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను.

03 నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనమువంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని.

04 తూర్పుతట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను.

05 ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసికొనిరాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను.

06 మందిరములోనుండి యొకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నాయొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను.

07 నరపుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించెదను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచక యుందురు, నాకును వారికిని మధ్య గోడమాత్రముంచి

08 నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని.

09 వారు జారత్వము మాని, తమ రాజుల కళేబరములను నాయొద్దనుండి దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యను నేనెల్లప్పుడును నివసింతును.

10 కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములనుబట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను.

11 తాము చేసినవాటన్నిటినిబట్టి వారు సిగ్గుపడినయెడల, మందిరముయొక్క వైఖరిని దాని యేర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానినిగూర్చిన మర్యాదలన్నిటిని విధులన్నిటిని దాని ఆచారములను క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచారవిధులన్నిటిని గైకొని ఆచరించునట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము.

12 ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధము, మందిరమును గూర్చిన విధి యిదియే.

13 మూరల కొలచొప్పున బలిపీఠముయొక్క కొలత ఎంతనగా మూరెడు, అనగా మూరెడు జేనెడు బలిపీఠమునకు పీఠమొకటి యుండవలెను. దాని డొలుపు మూరెడెత్తును మూరెడు వెడల్పును చుట్టు దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను.

14 నేలమీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరువరకును ఎత్తు రెండు మూరలు, వెడల్పు మూరెడు మరియు చిన్నచూరు మొదలుకొని పెద్ద చూరువరకు నాలుగు మూరలు, దాని వెడల్పు మూరెడు.

15 దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండమునుండి పైకి నాలుగు కొమ్ములుండెను,

16 దేవాగ్ని గుండము పండ్రెండు మూరల కొలతగలదై చచ్చౌకముగా నుండెను.

17 మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల పదునాలుగు మూరలు, దాని చుట్టునున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు మూరెడు, డొలపు ఒకటియుండెను, దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను.

18 మరియు అతడు నాతో ఇట్లనెను నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి, దహనబలులు అర్పించుటకై విధులనుబట్టి ఈలాగున జరిగింపవలెను.

19 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా పరిచర్యచేయుటకై నా సన్నిధికివచ్చు సాదోకు సంతానపు లేవీయులగు యాజకులకు పాపపరిహారార్థబలి అర్పిం చుటకై కోడెను ఇయ్యవలెను.

20 వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను.

21 తరువాత పాపపరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను.

22 రెండవ దినమున పాప పరిహారార్థబలిగా నిర్దోషమైన యొక మేకపిల్లను అర్పింపవలెను; కోడెచేతను బలిపీఠమునకు పాపపరిహారము చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారము చేయవలెను.

23 దాని నిమిత్తము పాపపరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను.

24 యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటిమీద ఉప్పుచల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను.

25 ఏడు దినములు వరుసగా పాపపరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను.

26 ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్ర పరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను.

27 ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠముమీద మీ దహనబలులను మీ సమాధానబలులను అర్పింపగా నేను మిమ్మునంగీకరించెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.