Logo

యెహెజ్కేలు అధ్యాయము 36

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి,

02 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.

03 వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.

04 కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడుసొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థలములతోను నిర్జనమైన పట్టణములతోను

05 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరినిబట్టియు, శేషించిన అన్యజనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.

06 కాబట్టి ఇశ్రాయేలు దేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు అన్యజనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను.

07 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీ చుట్టునున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను.

08 ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చెదరు, మీరు చిగురుపెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు.

09 నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు.

10 మీమీద మానవజాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింపజేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును.

11 మీమీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధినొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాసస్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

12 మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.

13 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.

14 నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

15 నిన్నుగూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవిక భరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

16 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

17 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది.

18 కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి

19 వారి ప్రవర్తననుబట్టియు వారి క్రియలనుబట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆ యా దేశములకు చెదరిపోయిరి.

20 వారు తాము వెళ్లిన స్థలములలోని జనులయొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.

21 కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని.

22 కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.

23 అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధ పరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

24 నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలోనుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను.

25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.

26 నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

27 నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొనువారినిగాను మిమ్మును చేసెదను.

28 నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులైయుందురు నేను మీ దేవుడనైయుందును.

29 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.

30 అన్యజనులలో కరవునుగూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమిపంటను నేను విస్తరింపజేసెదను.

31 అప్పుడు మీరు మీ దుష్‌ ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములనుబట్టియు హేయక్రియలనుబట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.

32 మీ నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదని తెలిసికొనుడి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తననుగూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి.

33 మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును.

34 మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును.

35 పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయెననియు జనులు చెప్పుదురు.

36 అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసికొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును.

37 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నాయొద్ద విచారణ చేయనిత్తును, గొఱ్ఱలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను.

38 నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.