Logo

నిర్గమకాండము అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తముచేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను

02 మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే యెహోవాను;

03 నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.

04 మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని.

05 ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను.

06 కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములోనుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి,

07 మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనైయుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు.

08 నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా

09 మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమునుబట్టియు మోషే మాట వినరైరి.

10 మరియు యెహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి,

11 ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.

12 అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

13 మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారి కాజ్ఞాపించెను.

14 వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.

15 షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.

16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

17 గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.

18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

19 మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.

20 అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

21 ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ

22 ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.

23 అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసికొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.

24 కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.

25 అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూలపురుషులు

26 ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.

27 ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.

28 ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున

29 యెహోవా నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా

30 మోషే చిత్తగించుము; నేను మాటమాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.