Logo

నిర్గమకాండము అధ్యాయము 24

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు ఆయన మోషేతో ఇట్లనెను నీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కివచ్చి దూరమున సాగిలపడుడి.

02 మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు.

03 మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి.

04 మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి

05 ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహన బలులనర్పించి యెహోవాకు సమాధాన బలులగా కోడెలను వధించిరి.

06 అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.

07 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.

08 అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.

09 తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కిపోయి

10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశమండలపు తేజమువంటిదియు ఉండెను.

11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.

12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా

13 మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.

14 అతడు పెద్దలను చూచి మేము మీయొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను

15 మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను.

16 యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు

17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.

18 అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.