Logo

నిర్గమకాండము అధ్యాయము 35

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా

02 ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును.

03 విశ్రాంతిదినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను.

04 మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లనెను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా

05 మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగుచేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,

06 నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ,

07 ప్రదీపమునకు తైలము,

08 అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యధూపమునకును సుగంధ సంభారములు,

09 ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొనిరావలెను.

10 మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.

11 అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు.

12 మందసము దాని మోతకఱ్ఱలు, కరుణాపీఠము కప్పు తెర,

13 బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు,

14 వెలుగు కొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము

15 ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమున ద్వారమునకు తెర.

16 దహనబలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట

17 ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర

18 మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు

19 పరిశుద్ధస్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను.

20 ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను.

21 తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రములకొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.

22 స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి.

23 మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరియొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి.

24 వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవనియొద్దనుండెనో వాడు దాని తెచ్చెను.

25 మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి.

26 ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.

27 ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను

28 సుగంధ ద్రవ్యమును, దీపమునకును అభిషేకతైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి.

29 మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటికొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.

30 మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి;

31 యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును,

32 రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును,

33 విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు.

34 అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.

35 చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పనియైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.