Logo

నిర్గమకాండము అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను

02 నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.

03 మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.

04 ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను.

05 ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

06 నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱలలోనుండియైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.

07 ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచుకొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్ల ద్వారబంధపు రెండు నిలువుకమ్ములమీదను పై కమ్మిమీదను చల్లి

08 ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను

09 దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;

10 దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.

11 మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలుచేత పట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.

12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతి యంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.

13 మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడుచేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.

14 కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను.

15 ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ యిండ్లలోనుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.

16 ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.

17 పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.

18 మొదటి నెల పదునాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను.

19 ఏడు దినములు మీ యిండ్లలో పొంగినదేదియును ఉండకూడదు, పులిసినదానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములో నుండక కొట్టివేయబడును.

20 మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను.

21 కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.

22 మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువుకమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలువెళ్లకూడదు.

23 యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువుకమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.

24 కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.

25 యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.

26 మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్మునడుగునప్పుడు

27 మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి.

28 అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.

29 అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరిని పశువుల తొలి పిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను

30 ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహా ఘోష పుట్టెను.

31 ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలువెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.

32 మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొనిపోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.

33 ఐగుప్తీయులు మనమందరము చచ్చినవారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి.

34 కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.

35 ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.

36 యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.

37 అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.

38 అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.

39 వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.

40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.

41 ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిపోయెను.

42 ఆయన ఐగుప్తు దేశములోనుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.

43 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని

44 వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.

45 పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు.

46 మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలోనుండి బయటికి తీసికొనిపోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు.

47 ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.

48 నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.

49 దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలెననెను.

50 ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.

51 యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.