Logo

నిర్గమకాండము అధ్యాయము 14

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను

02 ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను

03 ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడియున్నారు; అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును.

04 అయితే నేను ఫరో హృదయమును కఠిన పరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసికొందురనెను. వారు ఆలాగు దిగిరి

05 ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకీలాగు చేసితివిు? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితివిు అని చెప్పుకొనిరి.

06 అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొనిపోయెను.

07 మరియు అతడు శ్రేష్ఠమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములనన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను.

08 యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి.

09 ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.

10 ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.

11 అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?

12 మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటె ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి.

13 అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.

14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

15 అంతలో యెహోవా మోషేతో నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.

16 నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.

17 ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠిన పరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును.

18 నేను ఫరోవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.

19 అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను

20 అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు

21 మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

22 నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

23 ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.

24 అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి

25 వారి రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

26 అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగివచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.

27 మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.

28 నీళ్లు తిరిగివచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

29 అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.

30 ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి.

31 యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.