Logo

నిర్గమకాండము అధ్యాయము 34

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేతో మొదటి పలకలవంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను.

02 ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరముమీద నా సన్నిధిని నిలిచియుండవలెను.

03 ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండమీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.

04 కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా

05 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.

06 అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా.

07 ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.

08 అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారము చేసి

09 ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించు మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొనుమనెను

10 అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను; భూమిమీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరియెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు నేను నీయెడల చేయబోవునది భయంకరమైనది

11 నేడు నేను నీకాజ్ఞాపించుదాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్లగొట్టెదను.

12 నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును.

13 కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.

14 ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా; ఆయన రోషము గల దేవుడు.

15 ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచినయెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.

16 మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.

17 పోతపోసిన దేవతలను చేసికొనవలదు.

18 మీరు పొంగనివాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.

19 ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొఱ్ఱ పిల్లయేగాని అది నాదగును

20 గొఱ్ఱపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు పట్టిచేతులతో కనబడవలదు.

21 ఆరు దినములు నీవు పనిచేసి యేడవ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను.

22 మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.

23 సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను

24 ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు.

25 నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింపకూడదు; పస్కా పండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.

26 నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను.

27 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.

28 అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను

29 మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసియుండలేదు.

30 అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.

31 మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగివచ్చిరి, మోషే వారితో మాటలాడెను.

32 అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీపింపగా సీనాయి కొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికాజ్ఞాపించెను.

33 మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసికొనెను.

34 అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చువరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను

35 మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.