Logo

నిర్గమకాండము అధ్యాయము 17

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున

02 మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.

03 అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొనివచ్చితిరనిరి.

04 అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను.

05 అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేతపట్టుకొని పొమ్ము

06 ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.

07 అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.

08 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా

09 మోషే యెహోషువతో మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.

10 యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి

11 మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,

12 మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొనివచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.

13 అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.

14 అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము

15 తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి

16 అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను.