Logo

నిర్గమకాండము అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.

02 ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.

03 అప్పుడు మోషే ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.

04 దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

05 అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.

06 మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.

07 మరియు యెహోవా యిట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి.

08 కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను.

09 ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని.

10 కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.

11 అందుకు మోషే నేను ఫరోయొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా

12 ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.

13 మోషే చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీయొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినయెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని నడిగెను.

14 అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనై యున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.

15 మరియు దేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.

16 నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,

17 ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.

18 వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.

19 ఐగుప్తు రాజు మహాబలముతో మీమీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;

20 కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.

21 జనులయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.

22 ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండినగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.