పవిత్ర గ్రంథాలు

2సమూయేలు

అధ్యాయం 13

తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరి యుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.

తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను.

అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు

రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.

యెహోనాదాబు­ నీవు రోగివైనట్టు వేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు­ నా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధముచేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.

అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవిచేయగా

దావీదు నీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.

కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.

అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండనెను.

వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోను నీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గది లోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.

అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా

ఆమె నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచుకొందును?

నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము;

అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.

అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమె యెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటె అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా

ఆమె నన్ను బయటకు తోసివేయుటవలన నాకు నీవిప్పుడు చేసిన కీడుకంటె మరి యెక్కువకీడు చేయకుమని చెప్పినను

అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి దీనిని నాయొద్దనుండి వెళ్లగొట్టి తలుపు గడియవేయుమని చెప్పెను.

కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను.

అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తిమీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా

ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచి నీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊరకుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంటనుండెను.

ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను.

అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచిచెడ్డలేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతనిమీద పగయుంచెను.

రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.

అబ్షాలోము రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా

రాజు నా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను.

అయితే దావీదు వెళ్లనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోము నీవు రాకపోయినయెడల నా అన్నయగు అమ్నోను మాతోకూడ వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీయొద్దకు ఎందుకు రావలెనని రాజు అడుగగా

అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతనియొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను.

అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను.

అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పున వారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.

వారు మార్గములో ఉండగానే యొకడును లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా

అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను; మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడియుండిరి.

దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యౌవనులనందరిని వారు చంపిరని నా యేలినవాడవగు నీవు తలంచవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెను; ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటనుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటనుబట్టి నిశ్చయించుకొనవచ్చును.

కాబట్టి నా యేలినవాడవగు నీవు రాజకుమారులందరును మరణమైరని తలచి విచారపడవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెననెను.

అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయియుండెను. కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి.

యెహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు; నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయెనని రాజుతో చెప్పెను.

అతడు ఆమాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వసాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.

అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారునికొరకు అంగలార్చుచుండెను.

అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత

రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.