Logo

యిర్మియా అధ్యాయము 34 వచనము 2

యిర్మియా 34:1 బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.

యిర్మియా 34:2 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజుచేతికి అప్పగించుచున్నాను, అతడు మంటపెట్టి దాని కాల్చివేయును.

యిర్మియా 34:3 నీవు అతని చేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.

యిర్మియా 34:4 యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము నిన్నుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గమువలన మృతిబొందక నెమ్మదిగానే మృతిబొందెదవు.

యిర్మియా 34:5 నీకంటె ముందుగానుండిన పూర్వరాజులైన నీ పితరులకొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు -- అయ్యో నా యేలినవాడా, అని నిన్నుగూర్చి అంగలార్చుచు జనులు నీకొరకును ధూపద్రవ్యము కాల్చుదురు; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యిర్మియా 34:6 యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములుగల పట్టణములుగా మిగిలియున్నవి,

యిర్మియా 34:7 బబులోను రాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటిని ప్రకటించుచు వచ్చెను.

యిర్మియా 34:8 యూదులచేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులనుగాని హెబ్రీయురాండ్రనుగాని అందరిని విడిపించునట్లు విడుదల చాటింపవలెనని

యిర్మియా 34:9 రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

యిర్మియా 34:10 ఆ నిబంధననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్నవారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారిచేత కొలువు చేయించుకొనమనియు, ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి.

యిర్మియా 34:11 అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచుకొనిరి.

యిర్మియా 34:12 కావున యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

యిర్మియా 34:13 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని.

యిర్మియా 34:14 నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి.

యిర్మియా 34:15 మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని యొక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి, నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి.

యిర్మియా 34:16 పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత, అందరును తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరచుకొంటిరి

యిర్మియా 34:17 కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యములన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.

యిర్మియా 34:18 మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను;

యిర్మియా 34:19 అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.

యిర్మియా 34:20 వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతికిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.

యిర్మియా 34:21 యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండుచేతికిని అప్పగించుచున్నాను.

యిర్మియా 34:22 యెహోవా వాక్కు ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించుచున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.

యిర్మియా 34:7 బబులోను రాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటిని ప్రకటించుచు వచ్చెను.

యిర్మియా 32:2 ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,

యిర్మియా 39:1 యూదా రాజైన సిద్కియా యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చి దాని ముట్టడివేయగా

యిర్మియా 39:2 సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.

యిర్మియా 39:3 యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండులకధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.

యిర్మియా 52:4 అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.

యిర్మియా 52:5 ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.

యిర్మియా 52:6 నాల్గవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.

యిర్మియా 52:7 పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలువెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొనియుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.

యిర్మియా 52:8 కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.

యిర్మియా 52:9 వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబులోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను.

యిర్మియా 52:10 బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి

యిర్మియా 52:11 రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోనునకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతని పెట్టించెను.

2రాజులు 25:1 అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడిదిబ్బలు కట్టిరి.

2రాజులు 25:2 ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడియుండగా

2రాజులు 25:3 నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను.

2రాజులు 25:4 కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.

2రాజులు 25:5 అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లిపోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.

2రాజులు 25:6 వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.

2రాజులు 25:7 సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.

2రాజులు 25:8 మరియు బబులోనురాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ నెల యేడవ దినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి

2రాజులు 25:9 యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.

2దినవృత్తాంతములు 36:12 అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను.

2దినవృత్తాంతములు 36:13 మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.

2దినవృత్తాంతములు 36:14 అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.

2దినవృత్తాంతములు 36:15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన

2దినవృత్తాంతములు 36:16 పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.

2దినవృత్తాంతములు 36:17 ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలివారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతని చేతికప్పగించెను.

యిర్మియా 1:15 ఇదిగో నేను ఉత్తరదిక్కుననున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు.

యిర్మియా 27:5 అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.

యిర్మియా 27:6 ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.

యిర్మియా 27:7 అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.

దానియేలు 2:37 రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించియున్నాడు; తమరు రాజులకు రాజై యున్నారు.

దానియేలు 2:38 ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరిచేతికప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించియున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు

దానియేలు 4:1 రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక.

దానియేలు 4:22 రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడవైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.

దానియేలు 5:19 దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములును జనులును ఆ యా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.

యిర్మియా 1:3 మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైయుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడువరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను.

జెకర్యా 14:2 ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.