Logo

యెహెజ్కేలు అధ్యాయము 34

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱలను మేపవలెను గదా.

03 మీరు క్రొవ్విన గొఱ్ఱలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱలను మేపరు,

04 బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగము గలవాటిని స్వస్థపరచరు, గాయపడినవాటికి కట్టుకట్టరు, తోలివేసినవాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.

05 కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.

06 నా గొఱ్ఱలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు.

07 కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి

08 కాపరులు లేకుండ నా గొఱ్ఱలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహారమాయెను; కాపరులు నా గొఱ్ఱలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

09 కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.

10 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొనజాలక యుందురు; నా గొఱ్ఱలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

11 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నేను నేనే నా గొఱ్ఱలను వెదకి వాటిని కనుగొందును.

12 తమ గొఱ్ఱలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి

13 ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొనివచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.

14 నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నత స్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,

15 నేనే నా గొఱ్ఱలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

16 తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.

17 నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా గొఱ్ఱకును గొఱ్ఱకును మధ్యను, గొఱ్ఱలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.

18 విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా?

19 మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?

20 కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱలకును చిక్కిపోయిన గొఱ్ఱలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.

21 మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదరగొట్టెదరు.

22 నా గొఱ్ఱలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱకును గొఱ్ఱకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను.

23 వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.

24 యెహోవానైన నేను వారికి దేవుడనైయుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.

25 మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయుదును.

26 వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును,

27 ఫలవృక్ష ములు ఫలములిచ్చును, భూమి పంటపండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలోనుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

28 ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయములేకుండ వారు సురక్షిత ముగా నివసించెదరు.

29 మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోటయొకటి నే నేర్పరచెదను.

30 అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

31 నా గొఱ్ఱలును నేను మేపుచున్న గొఱ్ఱలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.