Logo

యెహెజ్కేలు అధ్యాయము 37

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా

02 యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.

03 ఆయన నరపుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుకగలవా? అని నన్నడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.

04 అందుకాయన ప్రవచనమెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండిపోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి.

05 ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;

06 చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీమీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

07 ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను.

08 నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయెను.

09 అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.

10 ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.

11 అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారుమన యెముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతివిు అని యనుకొనుచున్నారు

12 కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను.

13 నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా

14 నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

15 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

16 నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారిదనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దానిమీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటివారగు ఇశ్రాయేలువారిదనియు వ్రాయుము.

17 అప్పుడది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీచేతిలో ఒకటే తునకయగును.

18 ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా

19 ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారి తోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నాచేతిలో ఏకమైన తునకగా చేసెదను.

20 ఇట్లుండగా వారికీలాగు చెప్పుము

21 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏ యే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి

22 వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతములమీద

23 వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహములవలనగాని తాము చేసియున్న హేయ క్రియలవలనగాని యే అతిక్రమ క్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్రపరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనైయుందును.

24 నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు.

25 మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.

26 నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను.

27 నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనైయుందును వారు నా జనులైయుందురు.

28 మరియు వారిమధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు.