Logo

కీర్తనలు అధ్యాయము 39

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.

02 నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను.

03 నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని

04 యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొనగోరుచున్నాను.

05 నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే యున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు.(సెలా.)

06 మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.

07 ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను.

08 నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.

09 దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని.

10 నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీచేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.

11 దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మటకొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)

12 యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను

13 నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.