Logo

కీర్తనలు అధ్యాయము 78

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి

02 నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను.

03 మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.

04 యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.

05 రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియలను మరువకయుండి

06 యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేనివారై తమ పితరులవలె తిరుగబడకయు

07 మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును

08 ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను

09 విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి

10 వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లక పోయిరి

11 ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరచిపోయిరి.

12 ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.

13 ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను

14 పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను

15 అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.

16 బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.

17 అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.

18 వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.

19 ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.

20 ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి.

21 యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను.

22 వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.

23 అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరచెను

24 ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారికనుగ్రహించెను.

25 దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

26 ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.

27 ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలుగల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.

28 వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.

29 వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.

30 వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే

31 దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను.

32 ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి.

33 కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను.

34 వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి.

35 దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి.

36 అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు

37 నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.

38 అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.

39 కాగా వారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలిరాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.

40 అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.

41 మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.

42 ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.

43 ఐగుప్తులో తన సూచకక్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.

44 ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను

45 ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.

46 ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.

47 వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడుచేసెను.

48 వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.

49 ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.

50 తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.

51 ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.

52 అయితే గొఱ్ఱలవలె ఆయన తన ప్రజలను తోడుకొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను

53 వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.

54 తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను.

55 వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను.

56 అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.

57 తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి.

58 వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి.

59 దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను.

60 షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.

61 ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.

62 తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను

63 అగ్ని వారి యౌవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.

64 వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

65 అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను.

66 ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.

67 పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.

68 యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.

69 తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను

70 తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను.

71 పాడిగొఱ్ఱలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.

72 అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.