Logo

కీర్తనలు అధ్యాయము 77

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.

02 నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాపబడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది.

03 దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.)

04 నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను.

05 తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.

06 నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసికొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.

07 ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?

08 ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయెనా?

09 దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా.)

10 అందుకు నేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము.

11 యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును

12 నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.

13 దేవా నీ మార్గము పరిశుద్దమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?

14 ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొనియున్నావు.

15 నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతివారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు.

16 దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను.

17 మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.

18 నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.

19 నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

20 మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడిపించితివి.