Logo

కీర్తనలు అధ్యాయము 47

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.

02 యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజైయున్నాడు.

03 ఆయన జనములను మనకు లోపరచును మన పాదములక్రింద ప్రజలను అణగద్రొక్కును.

04 తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.

05 దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.

06 దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.

07 దేవుడు సర్వభూమికి రాజైయున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.

08 దేవుడు అన్యజనులకు రాజైయున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనముమీద ఆసీనుడైయున్నాడు.

09 జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు.

10 భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను.