Logo

కీర్తనలు అధ్యాయము 53

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలుచేయువాడొకడును లేడు.

02 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

03 వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.

04 దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?

05 భయకారణము లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడివేయువారి యెముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి.

06 సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.