Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ కాలమందు యెహోవా మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండయెక్కి నాయొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.

02 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.

03 కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని.

04 ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి

05 నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.

06 ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను.

07 అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోదనుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి.

08 నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.

09 కాబట్టి తమ సహోదరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.

10 నేను మునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేసెను.

11 మరియు యెహోవా నాతో ఇట్లనెను ఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకొనునట్లు నీవు లేచి వారిముందర సాగుమని చెప్పెను.

12 కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణమనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,

13 నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?

14 చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.

15 అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలె ఏర్పరచుకొనెను.

16 కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్కరులు కాకుండుడి

17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహా దేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.

18 ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.

19 మీరు ఐగుప్తు దేశములో పరదేశులైయుంటిరి గనుక పరదేశిని జాలితలచుడి.

20 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.

21 ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.

22 నీ పితరులు డెబ్బదిమందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసియున్నాడు.