Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 21

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు, వాని చంపినవాడెవడో అది తెలియక యుండినయెడల

02 నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను.

03 ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని

04 దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా ఆ లోయలో ఆ పెయ్యమెడను విరుగతియ్యవలెను.

05 అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.

06 అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరు ఆ యేటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పెయ్యపైని తమచేతులు కడుగుకొని

07 మాచేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు.

08 యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము; నీ జనమైన ఇశ్రాయేలీయులమీద నిర్దోషియొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారినిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.

09 అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్యనుండి నిర్దోషియొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు.

10 నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీచేతికి వారిని అప్పగించిన తరువాత

11 వారిని చెరపట్టి ఆ చెరపట్టబడినవారిలో రూపవతియైనదానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసికొన మనస్సయి

12 నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని

13 గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ యింట నివసించి యొక నెలదినములు తన తండ్రులనుగూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొనవచ్చును; ఆమె నీకు భార్యయగును.

14 నీవు ఆమెవలన సంతుష్టినొందనియెడల ఆమె మనస్సువచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనే గాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు; నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు.

15 ప్రేమింపబడున దొకతెయు ద్వేషింపబడున దొకతెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని

16 జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైనయెడల, తండ్రి తనకు కలిగినదానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు.

17 ద్వేషింపబడినదాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే.

18 ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాట గాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయినయెడల

19 అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొనివచ్చి

20 మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడియున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్పవలెను.

21 అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.

22 మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల

23 అతని శవము రాత్రివేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.