Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 16

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆబీబునెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొనుండి నిన్ను రప్పించెను.

02 యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱమేకలలోగాని గోవులలోగాని బలి అర్పింపవలెను.

03 పస్కాపండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.

04 నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించినదాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండకూడదు.

05 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు.

06 నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరివచ్చినbవేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి

07 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను.

08 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

09 ఏడు వారములను నీవు లెక్కింపవలెను. పంటచేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని యేడు వారములను లెక్కించి

10 నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీచేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది దానినియ్యవలెను.

11 అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్యనున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

12 నీవు ఐగుప్తులో దాసుడవైయుండిన సంగతిని జ్ఞాపకము చేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.

13 నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.

14 ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను.

15 నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీచేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.

16 ఏటికి మూడు మారులు, అనగా పొంగనిరొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.

17 వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెనచొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.

18 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమునుబట్టి జనులకు తీర్పు తీర్చవలెను.

19 నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.

20 నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను.

21 నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏవిధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు.

22 నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైన నిలువబెట్టకూడదు.