Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 20

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.

02 అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించునప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలెను

03 ఇశ్రాయేలీయులారా, వినుడి; నేడు మీరు మీశత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి,

04 వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధముచేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.

05 మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

06 ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినునుగనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

07 ఒకడు స్త్రీని ప్రధానము చెసికొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునుపే యుధ్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

08 నాయకులు జనులతో యెవడు భయపడి మెత్తనిగుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను.

09 నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను.

10 యుధ్దము చేయుటకు మీరొక పురముమీదికి సమీపించునప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి

11 గుమ్మములను తెరచినయెడల దానిలోనున్న జనులందరు నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు.

12 అది మీతో సమాధానపడక యుద్ధమే మంచిదని యెంచినయెడల దాని ముట్టడివేయుడి.

13 నీ దేవుడైన యెహోవా దాని నీచేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను.

14 అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్లసొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.

15 ఈ జనముల పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే యీలాగున చేయవలెను.

16 అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు.

17 వీరు, అనగా హీత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి,

18 నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను.

19 నీవు ఒక పురమును లోపరచుకొనుటకు దానిమీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడివేయునప్పుడు, దాని చెట్లు గొడ్డలిచేత పాడుచేయకూడదు; వాటి పండ్లు తినవచ్చునుగాని వాటిని నరికివేయకూడదు; నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? అట్టి చెట్లను నీవు కొట్టకూడదు.

20 ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవి కావని నీవెరుగుదువో వాటిని పాడుచేసి నరికి, నీతో యుద్ధముచేయు పురము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టవచ్చును.