Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.

02 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.

03 బయల్పెయోరు విషయములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను.

04 మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటివరకు సజీవులై యున్నారు.

05 నా దేవుడైన యెహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.

06 ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.

07 ఏలయనగా మనము ఆయనకు మొఱపెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?

08 మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులును గల గొప్ప జనమేది?

09 అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి

10 నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా యెహోవా నాయొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము.

11 అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా

12 యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి.

13 మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతిపలకలమీద వాటిని వ్రాసెను.

14 అప్పుడు మీరు నదిదాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకాజ్ఞాపించెను.

15 హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్యనుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు.

16 కావున మీరు చెడిపోయి భూమిమీదనున్న యే జంతువు ప్రతిమనైనను

17 ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను

18 నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమనుగాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపము గలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశమువైపు కన్నులెత్తి

19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.

20 యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయజనముగా నుండుటకై, ఐగుప్తు దేశములోనుండి ఆ యినుప కొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.

21 మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను.

22 కావున నేను ఈ యొర్దాను దాటకుండ ఈ దేశముననే చనిపోదును; మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు.

23 మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.

24 ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునైయున్నాడు.

25 మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొని, యే స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసినయెడల

26 మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.

27 మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.

28 అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజించెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.

29 అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.

30 ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల

31 నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనము చేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.

32 దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటె ముందుగానుండిన మునుపటి దినములలో ఆకాశముయొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము

33 నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా?

34 మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నముచేసెనా?

35 అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరియొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.

36 నీకు బోధించుటకు ఆయన ఆకాశమునుండి తన స్వరమును నీకు వినిపించెను; భూమిమీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్యనుండి ఆయన మాటలను నీవు వింటిని.

37 ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను.

38 నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందరనుండి వెళ్లగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగానుండి ఐగుప్తులోనుండి తన మహాబలముచేత నిన్ను వెలుపలికి రప్పించెను.

39 కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము

40 మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.

41 అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల

42 చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రదుకును.

43 అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.

44 మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది.

45 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెలుపలికి వచ్చుచుండగా

46 యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటిలోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశమందు

47 మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి.

48 మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులోనుండి వచ్చుచు ఆ సీహోనును హతముచేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కుననున్న బాషాను రాజైన ఓగుయొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమోరీయుల యిద్దరు రాజులదేశమును,

49 పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రమువరకు తూర్పుదిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీనపరచుకొనిరి.