Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువురీతి యేదనగా

02 తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు.

03 అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరునియొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను.

04 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును.

05 కావున నేడు నేను నీకాజ్ఞాపించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో బీదలు ఉండనే ఉండరు.

06 ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పుచేయవు; అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు.

07 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు.

08 నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.

09 విడుదల సంవత్సరమైన యేడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును.

10 నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.

11 బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.

12 నీ సహోదరులలో హెబ్రీయుడేగాని హెబ్రీయురాలేగాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయవలెను.

13 అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతులతో వాని పంపివేయకూడదు.

14 నీవు ఐగుప్తు దేశములో దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వానికియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను.

15 ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీకాజ్ఞాపించియున్నాను.

16 అయితే నీయొద్ద వానికి మేలుకలిగినందున నిన్నును నీ యింటివారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీయొద్దనుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పినయెడల

17 నీవు కదురును పట్టుకొని, తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడైయుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను.

18 వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును.

19 నీ గోవులలోనేమి నీ గొఱ్ఱమేకలలోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱమేకలలో తొలిచూలుదాని బొచ్చు కత్తిరింపకూడదు.

20 యెహోవా యేర్పరచుకొను స్థలమున నీవును నీ యింటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను.

21 దానిలో లోపము, అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినయెడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు.

22 జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పారబోయవలెను.

23 వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను