క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.
02 అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును
03 సోయరువరకు ఈతచెట్లుగల యెరికో లోయచుట్టు మైదానమును అతనికి చూపించెను.
04 మరియు యెహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమునకిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నదిదాటి అక్కడికి వెళ్లకూడదు.
05 యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను.
06 బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.
07 మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.
08 ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేనుగూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను.
09 మోషే తనచేతులను నూను కుమారుడైన యెహోషువమీద ఉంచియుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతనిమాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.
10 ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని
11 అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో
12 వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులయెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు.