Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 30

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన

02 సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీకాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల

03 నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.

04 మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పించును.

05 నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచుకొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింపజేయును.

06 మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును.

07 అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువులమీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును.

08 నీవు తిరిగివచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుందువు.

09 మరియు నీ దేవుడైన యెహోవా నీచేతిపనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమిపంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును.

10 ఈ ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును.

11 నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు.

12 మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు;

13 మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మనయొద్దకు దాని తెచ్చును అని నీవనుకొననేల? అది సముద్రపు అద్దరి మించునది కాదు.

14 నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది.

15 చూడుము; నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను.

16 నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును.

17 అయితే నీ హృదయము తిరిగిపోయి, నీవు విననొల్లక యీడ్వబడినవాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించినయెడల

18 మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటపోవుచున్న దేశములో మీరు అనేకదినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను.

19 నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను.

20 నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమైయున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.