Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి.

02 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను.

03 యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.

04 యెహోవా ఆ కొండమీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు.

05 గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను.

06 దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.

07 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.

08 పైనున్న ఆకాశమందేగాని, క్రిందనున్న భూమియందేగాని భూమి క్రిందనున్న నీళ్లయందేగాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు.

09 వాటికి నమస్కరింపకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు

10 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారి విషయములో వేయి తరములవరకు కరుణించువాడనై యున్నాను.

11 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు.

12 నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుము.

13 ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.

14 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిదయైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.

15 నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందుచేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను.

16 నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.

17 నరహత్య చేయకూడదు.

18 వ్యభిచరింపకూడదు.

19 దొంగిలకూడదు.

20 నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

21 నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగువాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.

22 ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతిపలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.

23 మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటిమధ్యనుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులును మీ పెద్దలును నాయొద్దకు వచ్చి

24 మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి.

25 కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినినయెడల చనిపోదుము.

26 మావలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్నిమధ్యనుండి పలుకుట విని బ్రదికెను?

27 నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినయెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి.

28 మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే.

29 వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.

30 మీ గుడారములలోనికి తిరిగివెళ్లుడని నీవు వారితో చెప్పుము.

31 అయితే నీవు ఇక్కడ నాయొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను.

32 వారు స్వాధీనపరచుకొనునట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు ఆలాగు ప్రవర్తింపవలెను.

33 కాబట్టి మీరు కుడికేగాని యెడమకేగాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.