పవిత్ర గ్రంథాలు

సంఖ్యాకాండము

అధ్యాయం 33

మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తు దేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.

మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.

మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులోనుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారిమధ్యను యెహోవా హతముచేసిన తొలిచూలులనందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.

అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.

ఇశ్రాయేలీయులు రామెసేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.

సుక్కోతులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములోదిగిరి.

ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.

పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణముచేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.

ఏలీములో పండ్రెండు నీటిబుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.

ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱసముద్రము నొద్ద దిగిరి.

ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

సీను అరణ్యములోనుండి బయలుదేరి దోపకాలో దిగిరి

దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.

ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.

రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.

సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.

కిబ్రోతుహతావాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.

హజేరోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.

రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.

రిమ్మోను పారెసులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి.

లిబ్నాలోనుండి బయలుదేరి రీసాలో దిగిరి.

రీసాలోనుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి.

కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.

షాపెరు కొండనొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.

హరాదాలోనుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.

మకెలోతులోనుండి బయలుదేరి తాహతులో దిగిరి.

తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.

తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.

మిత్కాలోనుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి.

హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.

హోర్‌హగ్గిద్గాదులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.

యొత్బాతాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.

ఎబ్రోనాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.

ఎసోన్గెబెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి.

కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.

యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.

అహరోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.

అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.

వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.

సల్మానాలోనుండి బయలుదేరి పూనొనులో దిగిరి.

పూనొనులోనుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.

ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.

ఈయ్యె అబారీములోనుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి.

దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.

అల్మోను దిబ్లాతాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబారీము కొండలలో దిగిరి.

అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.

వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.

యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు యొర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత

ఆ దేశనివాసులందరిని మీ యెదుటనుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి

ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.

మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రములచొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.

అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.

మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.