Logo

కీర్తనలు అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.

02 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.

03 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

04 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు

05 డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు

06 అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.

07 నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను

08 యెహోవా, నాకొఱకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.

09 వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు.

10 దేవా, వారు నీమీద తిరుగబడియున్నారు వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.

11 నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.

12 యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చిఉల్లసింతురు.